కేవలం పదోతరగతి, ఐటీఐ అర్హతతో కేంద్రహోంమంత్రిత్వశాఖ పరిధిలో ఉద్యోగాలు. మంచి గ్రేడ్‌పేతో భరోసా కలిగిన జాబ్. పలు సదుపాయాలను కల్పిస్తారు. వీటన్నింటి సమాహారమే సీఐఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్/ట్రేడ్స్‌మెన్ ఉద్యోగాలు. ఈ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా వాటి వివరాలు...

కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు. కేంద్ర, రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆరునెలలుగా భారీ నియామకాలు ఏవీ లేవు. ఎన్నికల అనంతరం వచ్చిన నోటిఫికేషన్స్‌లో ఎక్కువ భాగం బ్యాంకింగ్ రంగానికి సంబంధించినవే. దాంతోపాటు ఇంటర్+కంప్యూటర్ లేదా డిగ్రీ అర్హతతో ఉన్నవే. కానీ కేవలం పదోతరగతి, ఐటీఐ చేసిన వారికి ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల కాలేదు. ఈ నేపథ్యంలో సీఐఎస్‌ఎఫ్ నుంచి సుమారు 1000 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 

నోటిఫికేషన్ వివరాలు:కానిస్టేబుల్(ట్రేడ్స్‌మన్) ఉద్యోగాలు.

బార్బర్, బూట్స్‌మేకర్, కుక్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మోటారు పంప్ అటెండెంట్, పేయింటర్, స్వీపర్, వాషర్‌మ్యాన్ అండ్ వాటర్ క్యారియర్ ట్రేడ్స్‌లో ఉద్యోగాలు ఉన్నాయి.
పే బ్యాండ్ 1: రూ. 5,200 - 20,200 + గ్రేడ్‌పే రూ. 2,000/- + సాధారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఇతర అలవెన్స్‌లు.

వయస్సు: 2014, ఆగస్టు 1 నాటికి 18 -23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల వయో సడలింపు ఉంటుంది.

విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన అర్హతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. అన్‌స్కిల్డ్ ట్రేడ్స్(స్వీపర్, వాటర్ క్యారియర్ లాంటి వాటికి) పదోతరగతి లేదా తత్సమాన అర్హత ఉంటే చాలు.

శారీరక ప్రమాణాలు:

జనరల్/ఎస్సీ/ఓబీసీ అభ్యర్థులకు - 170 సెంటీమీటర్ల ఎత్తు, 8- 85 సెంటీమీటర్ల ఛాతీ ఉండాలి.
బరువు: ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.

ఎంపిక విధానం: మూడంచెల విధానంలో ఎంపిక చేస్తారు.

మొదటి స్టేజ్: నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

రెండో స్టేజ్: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్(పీఈటీ). దీనిలో మైలు దూరాన్ని ఆరు నిమిషాల 30 సెకన్లలో పరుగెత్తాలి. దీనిలో అర్హత సాధించిన వారికి తర్వాత స్టేజ్‌కి అనుమతిస్తారు.

మూడో స్టేజ్: ట్రేడ్‌టెస్ట్. దీనిలో సంబంధిత ట్రేడ్‌లో అంశాలను ప్రాక్టికల్‌గా పరీక్షిస్తారు.

మెరిట్ లిస్ట్: ట్రేడ్‌టెస్ట్‌లో కనపరచిన ప్రతిభ ఆధారంగా కేటగిరీల వారీగా, ట్రేడ్‌ల వారీగా మెరిట్‌లిస్ట్‌ను తయారుచేస్తారు.

అనంతరం జాబితాలో ఉన్న అభ్యర్థులకు మెడికల్‌టెస్ట్ నిర్వహిస్తారు.

దరఖాస్తు: నిర్ణీత నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి పంపాలి.
చివరితేదీ: సెప్టెంబర్ 16
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.cisfrecruitment.org చూడవచ్చు.